Friday, February 1, 2013

గంజి నీళ్ళు

"ఏమిటి  సూరీ ఇంకా ఆలోచిస్తావా?  ఎవరో డాక్టర్ అట ఫోటో కూడా చూపించారు, జాతకం కూడా కలిసింది అని వాళ్ళ దగ్గర నుంచి కబురు వచ్చింది, ఇంకా ఆలోచించాలా?"
"చూడు చంద్రం, ఇలాంటివి అప్పటికప్పుడే తేల్చుకునేవి కావు, ఇది నీకూ తెలుసు, కొంచెం ఆలోచించనీ"
"అదిగో మళ్లీ ఆలోచన అంటున్నావు, మీ మగాళ్ళు అందరూ ఇంతేనా? ముందు మాయ చేసి, తర్వాత ప్రేమ అని కాలక్షేపం చేయగలిగిన రోజులు కాలక్షేపం చేసి, తర్వాత చేతులెత్తెస్తారు"
"మగాళ్ళ గురించి అలా అనేస్తావు ఎమిటి? మన విషయం ఇంట్లో చెప్పినప్పుడు, నేను బ్రాహ్మణుడిని అని, నువ్వు కోమట్లు అని ఇలా కులాల గురించి పోట్లాడుకున్నారు. మళ్లీ వాళ్ళ దగ్గర నీ గురించి ఎలా చెప్పటం, ఈ సారి చెప్తే అసలు నిన్ను కలవనిస్తారా?"
"ఇప్పుడు మాత్రం వాళ్లకి తెలిసే కలుసుకున్తున్నమా? అయినా ఇంత ఎందుకు, అసలు నన్ను పెళ్ళి, అదే నువ్వు అంటావు కదా కలిసి బ్రతకటం అని, అది చేయాలని ఉందా?"
"ఏ క్షణమైనా నీతోనే నా ముగింపు, నా అంతం. నీతో ఉండటం కంటే నాకు ఇంకేమి కావాలి "
"ఇన్ని కథలూ, సినిమా డైలాగ్సూ చెప్తావు మరి ఆలోచన దేనికి? ఏదో ఒకటి చేయొచ్చు కదా"
"సరే, నువ్వే చెప్పు ఏం చెయ్యమంటావు?"
"నేనా? ఇందుకేనా నన్ను ఇన్ని రోజులూ పెళ్ళి చేసుకోకుండా ఆపింది? నా పేరు సూర్య నారాయణ, నీ పేరు చంద్రలేఖ చూసావా పేర్లు కూడా కలిసాయి, ఒకరి కోసం ఒకరు పుట్టామేమో అని ఐదేళ్ళ కింద చెప్పి, ఇప్పుడు మళ్లీ నన్ను చెప్పమంటావా?"
"సరే సరే ఇక ఆపు, రేపు ఉదయం దాకా ఆగు"
"కానీ పొద్దున్న దాకా ఎందుకు? నన్ను చూసి వెళ్ళడానికి ఆ మూక రేపే వస్తుందో, రేపు కుదరదు ఇప్పుడే చెప్పు"
"మూకా? వాళ్ళు ఏమైనా గొర్రెలా లేక పశువులా? మంచి వాళ్ళే అయి ఉంటారు"
"వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎలా ఉంటారు? ఎలా ఆలోచిస్తారు? ఇవన్నీ నాకు తెలియదు, తెలుసుకోవాలనీ లేదు. నీకు ఉద్యోగం ఉంది, చదువు ఉంది, ఇవి చాలదూ మనం కలిసి బ్రతకటానికి?" 
"సరిపోతుంది, మరి ఈ పెద్ద వాళ్ళు, ఈ మర్యాదలూ ఇవన్నీ నీకు అవసరం లేదా?"
"నాకు నీతో ఉండటం కావాలి, వీరే వాళ్ళతో పని లేదు"
"నీ మాటలు నా స్నేహితులు కానీ, నీ స్నేహితులు కానీ వింటే, Immature and foolish అని అంటారు"
"ఎవరో ఏదో అంటారు అని మనకి నచ్చిన పనులు చేయటం మానోద్దని పెద్ద హీరోలా చెప్తావు, అన్నీ ఉత్తి మాటలే అనమాట"
"ఎందుకు అలా రేచ్చాగోడుతున్నావు, ఈ రోజు కొత్తగా?"
"ఇలా మాట్లాడకపోతే నీలో చలనం లేదు కాబట్టి"
"సరే, మీ ఇంటి నుంచి రేపే వచ్చేయి నాతో"
"మరి పెళ్ళి గుడిలోనా లేక అది చేసుకోకుండానే కలిసి బ్రతుకుదాం అంటావా?"
"నీకు తెలుసు కదా నాకు మతం, కులం గుడి ఇలాంటి వాటి పై నమ్మకం లేదు అని"
"అందుకే కదా, ఇంతగా నచ్చావు. అయితే వస్తే చాలు, కలిసి బ్రతుకుదాం అంటావు"
"లేదు registrar office లో సంతకాలు పెట్టుకుందాం. అది చాలు మనం హాయిగా ఉండటానికి"
"ఎంత బాగా చెప్పావు, సరే అలాగే రేపు ఏ బస్సుకి నువ్వు వెళ్ళేది?"
"ఏడింటి బస్సుకి"
"రేపు బస్టాండ్ లో కలుద్దాం"
"మరి నీ పెళ్ళి చూపులూ, ఆ మూకా?"
"వాళ్ళు మధ్యాహ్నం వస్తారు, చూసి వెళ్ళిపోతారు, అసలు నీ దగ్గరికి వచ్చే పూచీ నాది, తప్పకుండా వస్తా, ఇక వెళ్తాను"
"అప్పుడేనా?"
"గుడి, అని చెప్పి వచ్చా, సర్వ దేవతా దర్సనం గంట కంటే ఎక్కువ పట్టాడు. నేనే వెళ్ళకపోతే, మా వాళ్ళు వస్తారు"

ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నాకు నిద్ర లేదు. నేను చేయబోయే పని, unethical, లేచిపోవటం, సమాజం ఒప్పుకోదు కానీ వేరే మార్గం కూడా తోచటం లేదు పైగా దాని గురించి ఆలోచించటానికి సమయం కూడా లేదు. ఇలా అనుకుంటూ ఉండగా ఎప్పుడు కునుకు పట్టిందో తెలియదు. లేచి చూసాను, నాన్న వరండాలో కాఫీ తాగుతున్నారు. అమ్మ పూజ చేస్తోంది. తమ్ముడు వాడి గదిలో చదువుకుంటున్నాడు. అంతా షరా మామూలే ఎమీ కొత్తగా లేదు.

నిన్న చంద్రం చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. సాయంత్రమే బస్సు, ఈ రోజే, ఈ సాయంకాలమే. ఇంతలో నాన్న "ఏ రా, ఈ రోజే కదా ప్రయాణం, అన్నీ చూసుకో పెట్టుకున్నావో లేదో?" "సరే నాన్నా" అన్నాను నేను. అమ్మ లోపలి నుంచి, "నాన్నా, మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఈ సారి వచ్చేటప్పటికి కోడలిని సిద్ధంగా ఉంచుతాం". అంతలోనే నాన్న అందుకుంటూ "ఔను రా, మన వీధి చివర సిద్ధాంతి గారి అమ్మాయి నిర్మల తెలుసుగా, ఆ అమ్మాయిని కోడలిగా చేసుకుందాం అనుకుంటున్నాం". వెంటనే అమ్మ "ఔను నాన్నా, చంద్రలేఖ కంటే వంద రెట్లు చక్కగా ఉంటుంది, చాలా నిర్మలమైన మొహం పేరుకు తగ్గట్టు" అని అంది.

"అమ్మా, నాన్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నేను చంద్రలేఖని పెళ్ళి చేసుకుందాం అనుకున్నా, మీరు ఆలె కంటే ఎంత అందమైన అమ్మాయిని తెచ్చినా, మంచి అమ్మాయిని తెచ్చినా నాకు నచ్చదు.పైగా నాకు ఈ సంప్రదాయ పెళ్ళిళ్ళు నచ్చావు, అది మీకు కూడా తెలుసు. ఈ విషయంలో మీరు బాధ పడతారని తెలుసు, మిమ్మల్ని బాధ పెడితే నేను నాశనం అవుతానని మీరు అంటారని  తెలుసు, కానీ నేను చంద్రంతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను, నా జీవితం నా నిర్ణయాల మీద ఆధార పడాలి కానీ మీ నిర్ణయాల మీద కాదు" అని గట్టిగా చెప్పాను నేను.

"వీడికి ఆ సిటీలో ఉన్న వాతావరణం, సినిమాలు, పుస్తకాలు ఇవే నేర్పుతాయి అనుకుంట, వాడే తెలుసుకుంటాడు" అన్నారు నాన్న అమ్మని చూస్తూ.

"వీళ్ళకి ఎంత చెప్పినా అర్ధం కాదు, అసలు అర్ధం చేసుకోవాలని ఉంటేగా" అని నాలో నేను అనుకున్నాను. రోజంతా ఇక అమ్మ సనుగుళ్ళు, నాన్న గొనుగుళ్ళతో గడిచిపోయింది.

సాయంత్రం ఆరు అయ్యింది. ఎప్పుడూ లేని వ్యాకులత, అవస్థ అప్పుడే మొదలయ్యాయి. బస్టాండ్ కి గబగబా నడుస్తూ చేరుకున్న. ఇంకో అరగంటలో బస్సు, ఇద్దరికీ టిక్కెట్లు తీసుకున్నా, ఇక ఎదురు చూపులు మొదలు. అసలు వస్తుందా? వస్తే ఎంత బావుంటుందో, ఇది నా జీవితంలో అన్నిటికంటే సంతోషమైన ప్రయాణం అవుతుంది. మరి రాక పొతే అసలు వెళ్ళగలనా? తను ఎందుకు రాలేదో వెళ్లి తెలుసుకోనూ. ఏమో ఇది అంటా కొత్తగా ఉంది, ఏదో తెలియని ఉత్కంఠ.

ఒక టీ తాగాను, ఐదు నిమిషాలలో బస్సు బయలుదేరుతుంది. Conductor 'హైదరాబాద్, హైదరాబాద్' అని అరుస్తున్నాడు. చంద్రం ఛాయలు మాత్రం కనపడటం లేదు. అదిగో ఇంతలో పక్కనే వచ్చి కూర్చుంది "ఏమిటీ, రాను అనుకున్నావా?" అని అడిగింది. "బస్సులో కూర్చుని మాట్లాడుకుందాం, ఔను నీ సంచి ఒక్కటేనా, మరి బట్టలూ?" అని నేను సందేహించాను. "ఓయి, అక్కడ కొనిస్తావు కదా అని తీసుకు రాలేదు, కొనివ్వనూ అని చెప్పు, ఇప్పుడే వెళ్ళి తెస్తాను కానీ బస్సు పోతుంది" అని నిదానంగా చెప్పింది.

బస్సెక్కి కూర్చున్నాం, అది బయలు దేరింది. రాత్రి వేళ ఒక సందేహం, "రేపు మా ఇంటి ఆయనకీ ఏం చెప్పాలి, ఇన్ని రోజులూ ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు చంద్రాన్ని చూసి ఏమంటాడో?" అని మనసులో అనుకుంటుండగా, ప్రక్కనే కునుకు తీస్తున్న చంద్రం "మా చుట్టాల అమ్మాయి చదువుకోవటానికి వచ్చింది అని మీ ఇంటి ఆయనతో చెప్పు" అని మెల్లగా గొణిగింది . "నా మనసులో ఎమనుకుంటున్నానో తనకి ఎలా తెలుస్తుందో కానీ ఖచ్చితంగా చెప్పేస్తుంది, ఇదే నిజమైన ప్రేమకి తార్కాణమేమో!"

హైదరాబాదు వచ్చింది, ఆటో ఎక్కి నేను ఉండె ఇంటిక వెళ్ళాము. ఎవరు లేరు బయట, పరిచయం చేయిద్దాం  అనుకున్నా కానీ సమయం కాదేమో అనిపించి పైన నేను ఉండే భాగానికి వెళ్ళాం. ఇంట్లోకి తీసుకెళ్ళి అంతా చూపించాను "అంతా బాగానే ఉంది, చాలా చక్కగా అమర్చుకున్నావు. ఔను, ఒంటరిగా ఉంటే ఏదో వెలితిగా ఉండదా కనీసం టి.వి. కూడా లేదు?" అని అడిగింది. "ఆ వెలితి తీర్చడానికి, అవిగో నా పుస్తకాలు, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇంకా వెలితి ఏముంది. సరే కానీ ఈ రోజు registrar office కి వెళ్ళి దరఖాస్తు పెడదాం  మన పెళ్ళికి, నెల రోజులు ముందే పెట్టాలి, తర్వాత వాళ్ళు మనకి తేదీ ఇస్తారు" అని చెప్పి ఒక గంటలో తయారు అయ్యాము.

కిందకి వచ్చి మా యజమానికి ఏ విషయం చెప్దాం అనుకుంటుండగా, ఆయన తాళం వేస్తున్నారు, "సమయానికి వచ్చావు సూర్యం, మా నాన్న గారు మంచం లో ఉన్నారు, ఇక రేపో, మాపో అన్నట్టుంది ఎప్పుడు వస్తామో చెప్పలేము, కొంచెం కనిపెట్టికుని ఉండు, పక్కింటి నరసింహం గారికి కూడా చెప్పానులే" అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆ దంపతులు. "కల్యాణం గురించి చెప్దామని వస్తే కాలం చేయబోయే ఆయన వార్తా విన్నాను", అని అనుకుని, చంద్రాన్ని తీసుకుని, ఇక registrar office కి బయలుదేరాను. 

ఆఫీసుకి వెళ్ళడం, దరఖాస్తు పెట్టడం, వాళ్ళు తారీఖు చెప్పడం జరిగింది. ఇక ఆ నెల రోజులు, నాకు మా ఇంట్లో వాళ్ళ నుంచి, తనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి బెదిరింపులు, "ఇక మీరు మాకు లేనట్టే" అనే మాటలు వింటూ నెల రోజులు సజావుగా సాగాయి. 

ఇక రేపే మా సంతకాల పెళ్ళి.

రోజూ రాత్రికి మల్లే ఆ రోజు రాత్రి కూడా 'రొమాన్సు' చేసుకున్నాం. దాని తర్వాత "ఔను రేపు మన పెళ్ళి  తర్వాత అయినా మన వాళ్ళు మన దగ్గరికి వస్తారా? అర్థం చేసుకుంటారా? అసలు వాళ్ళని కాదనుకుని, మనం బతకగలమా? నువ్వు ఇంకా కొంచెం మంచి ఉద్యోగం తెచ్చుకుని, ఒక మంచి కారు, ఒక సొంత ఇల్లు సంపాదించగలిగితే చాలు, మా వాళ్ళు తప్పకుండా మన పెళ్ళిని ఒప్పుకుంటారు" అని చెప్పింది. ఆ రోజు ఎన్నడూ లేనిది నా చంద్రమ నుంచి సందేహాలు, సూచనలూ  విన్నాను. 

"అంటే నంటావా? కులాన్నీ, మర్యాదనీ, పెద్దల్నీ, డబ్బునీ, ఇన్ని కాదనుకుని వచ్చింది మళ్ళీ వాటి కోసం ప్రాకులాడతానికేనా? అవన్నీ కావాలి అంటే అసలు ఇన్నాళ్ళ ప్రేమ ఎందుకు, ఈ సంతకాల పెళ్ళి  ఎందుకు? కలిసి బ్రతకాలి అనే కోరికే గనక ఉంటే చాలు, అడవిలో అయినా హాయిగా బ్రతకచ్చు, గంజి నీళ్ళు ఉన్నా సరే ఒకరినొకరం చూసుకుంటూ పాయసం లాగా అనుభవించి తాగచ్చు" ఆమె తలని నెమరేస్తో అన్నాను. మాట లేదు ఇక, అటు తిరిగి పడుకుంది. తను నిదురపోయిన్ది అనుకుని నేనో పడుకున్నాను.

పొద్దునే లేచాను, తను ఇంకా పడుకునే ఉంది, కాఫీ పెడదామని వంటింట్లోకి వచ్చాను. పొయ్యి మీద అన్నం గిన్న ఉంది, తను లేచి వచ్చింది "నిన్న రాత్రి అన్నం వండావా, ఆకలి వేసిందా?" అని అడిగాను. "లేదు దాహం వేసింది, గంజి చేసుకుని తాగాను. నువ్వు, ఈ గంజి నీళ్ళు ఉంటే చాలు హాయిగా బ్రతకచ్చు" అని నవ్వుతూ అంది.

ఇక registrar office కి వెళ్ళే టైమ్ అయ్యింది, తాళం వేస్తుండగా మా ఇంటి ఆయన పైకి వస్తున్నాడు, "నాయనా సూర్యం, తాళం చెవుల కోసం వచ్చాను" "ఇప్పుడే తెస్తాను" "అవునూ ఎవరీ అమ్మాయి, మీ చుట్టాలా?" అని అడిగాడు. "లేదండి నా కాబోయే భార్య, registrar office కి వెళ్తున్నాం పెళ్ళి చేసుకోవటానికి" ఇంతలో చంద్రం ఆయనకీ పాదాభివందనం చేసింది"సుమంగళీ భావ, ఇదేనా అమ్మా రావడం" "కాదండీ నెల రోజులు అయ్యింది" "ఓ అలాగా! నేను ఊళ్ళో లేను కదా, అయ్యో సమయానికి మా ఆవిడ లేదే, ఆమె ఇంకా రాలేదు ఊరు నుంచి" "ఫర్వాలేదు లెండి, రాగానే వచ్చి కలుస్తాను" "సరే అమ్మా, క్షేమంగా వెళ్ళి, పెళ్ళి చేసుకుని రండి" అని చెప్పి పంపించాడు ఆ పెద్దాయన. 

అలా బయటకి వచ్చి ఆటో ఎక్కి మొహాలు చూసుకున్నాం,  ఆనందం. అసలు మాట చెప్పినందుకు, ఏమీ దాచానందుకు. 'నిజాలు చెప్పటానికి ఏంటో ధైర్యం కావాలి, ఈ రోజు ఆ దారియం వచ్చేసింది' అని అనుకున్నాను. అదీ నేటి సమాజంలో, ఇలాంటి విషయం ఎదుటి వ్యక్తీ ఎలా స్పందిస్తాడో తెలియకుండా నిర్భయంగా నిజం చెప్పాం, అందుకే ఆనందం. 


---------------------------------------------------------------------

2 comments:

About Me

My photo
I firstly declare here that all the content written in the blog is exclusively written by me and I hold the copyrights of each and everything. Be it a poem or a movie review. Also, the videos or photographs I upload or attach are exclusively owned by me. This declaration is important in a world that seems so worried of piracy. The prime purpose of these blogs is to put my writings and photographs on the net. and well to start with.... I live in my mind, and existence is the attempt to bring my thoughts into physical reality, I celebrate myself, sing myself and I am always happy in my own company.....I am not the best in the world but I strive for excellence and thats what keeps me alive... Talking much about oneself can also be a means to conceal oneself--Friedrich Nietzsche