"సత్యము" అనేది మనిషికి ఏ వ్యవస్థ ద్వారానో , లేక మతం, సిద్ధాంతం, పూజ లేదా కర్మ ద్వారానో తెలియదు. ఏ తాత్విక జ్ఞానం లేదా మానసిక చర్య ద్వారా కూడా సత్యం బోధపడదు. "సత్యము" అనేది తన ఆలోచనల సమూహాన్ని, తన సంబంధాలను అద్దం లాగా చేసి వాటి పరిశీలన ద్వారా, తన మనస్సులోని విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా, విచక్షణ లేదా స్వీయ పరిశీలన ద్వారా తెలుసుకోవాలి.
మనిషి తనకు తానే రక్షణ కోసం మత, సామాజిక, రాజకీయ, వ్యక్తిగత కంచెలను, గోడలను నిర్మించుకున్నాడు. ఇవి చిత్రాలు, చిహ్నాలు, నమ్మకాలుగా వ్యక్తమవుతాయి. ఈ చిత్రాల భారం మనిషి ఆలోచన, అతని సంబంధాలు మరియు అతని రోజువారీ జీవితం పైన అధికారం చూపిస్తాయి. ఈ చిత్రాలు మనిషిని మనిషి నుండి వేరు చేయడానికి, మన సమస్యలకు కారణాలు. జీవితంపై మనిషి అవగాహన ఈ చిత్రాల నుండి అతని మనస్సులో ఇప్పటికే ఏర్పడిన భావనల ద్వారా రూపొందించబడింది.
మనిషి యొక్క స్పృహ, వివేకం తన అస్తిత్వానికి, ఉనికికి ఆధారం. సాంప్రదాయ అనుసరణ ద్వారా అతను పొందిన పేరు, గౌరవం మరియు సంస్కృతి పైపై మెరుగుల వ్యక్తిత్వం. మనిషి యొక్క ప్రత్యేకత సంప్రదాయ అనుసరణ లో లేదు, అతని స్పృహ లో దాగి ఉన్న విషయంలో ఉంది. అంటే ఎప్పుడు అయితే చిత్రాలు, చిహ్నాలు, నమ్మకాలకు మనిషి అతీతుడుగా ఉంటాడో అప్పుడే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ఇది మానవాళి అందరికీ సాధారణం. కానీ సాంప్రదాయ అనుసరణకి, కట్టుబాట్లకు మనం బానిసలం అయిపోయాం. సాంప్రదాయం లో ఒక హాయి ఉంటుంది, "సృష్టి ఎలా సంభవించింది?" అనే ప్రశ్నకు "దేవుడు" అనే సమాధానం హాయినిస్తుంది. ఆ సాంప్రదాయపు హాయిని త్యజించి నప్పుడే నిజమైన స్వేఛ్ఛ దొరుకుతుంది. కానీ మానవాళి నుంచి మనం మానవ మంద అయిపోయాం, దిగువ జీవులం అయిపోయి, ఆ సాంప్రదాయపు హాయిలో కాలం గడిపేస్తున్నాం.
స్వేచ్ఛ అనేది ప్రతిచర్య కాదు; స్వేచ్ఛ అనేది మనం ఎంచుకునేది కాదు. నేను స్వేచ్ఛగా ఉండాలి అనుకున్నాను కాబట్టి స్వేచ్ఛగా ఉన్నాను అనేది మనిషి యొక్క భ్రమ, నటన . స్వేచ్ఛ అనేది ఒక నిర్దిష్టమైన దిశ లేకుండా , ప్రతిఫలం ఆశించకుండా, శిక్షకు భయపడకుండా జరిగే స్వచ్ఛమైన పరిశీలన. స్వేచ్ఛ అనేది మనిషి చివరి పరిణామం కాదు, అతని ఉనికి యొక్క ప్రతి దశలో ఆలోచనలో ఉంటుంది. నిశితంగా పరిశీలిస్తే మనలో స్వేచ్ఛ లేకపోవడాన్ని మనం గ్రహిస్తాం.
ఆలోచన అనేది సమయం. ఆలోచన అనేది సమయం ఇంకా గతం నుండి విడదీయరాని అనుభవం ఇంకా జ్ఞానం నుండి పుట్టింది. సమయం మనిషి మానసిక శత్రువు. మనం చేసే ప్రతి పని, అనుభవం నుండి వచ్చిన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనిషి ఎప్పుడూ గతానికి బానిస. స్వేచ్చ అనంతం - ఆలోచన ఎప్పుడూ పరిమితం కాబట్టి మనం నిరంతరం సంఘర్షణ ఇంకా పోరాటంలో జీవిస్తాము దాని వల్ల మానసిక వికాసం లేదు. మనిషి స్వీయ ఆలోచనల కదలిక గురించి తెలుసుకున్నప్పుడు, అతను పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే ఆలోచనకి - ఆలోచించే వాడికి, గమనిస్తున్నవాడికి - గమనింపబడే వాడికి , మధ్య వ్యత్యాసం చూడగలుగుతాడు.
గతం లేదా సమయం యొక్క ప్రభావం లేకుండా అంతర్దృష్టి ఉన్న స్వచ్ఛమైన పరిశీలన మాత్రమే స్వేచ్ఛ ని ఇస్తుంది. ఈ కాలాతీత అంతర్దృష్టి, మనస్సులో లోతైన, తీవ్రమైన పరివర్తనను తెస్తుంది.
సంపూర్ణమైన నిరాకరణ అనేదే సానుకూల పరిణామం. మానసికంగా సైద్ధాంతికంగా మనల్ని మలిచిన - సాంప్రదాయాన్ని, గతాన్ని నిరాకరించినప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ, కరుణ, మేధో సంపత్తి కలిగి స్వేచ్ఛని అనుభవిస్తాం. అప్పుడే సత్యాన్ని గ్రహిస్తాం.